Game Changer Release Date:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని.. ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శంకర్ ఈ మధ్యనే దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదల సమయంలో కూడా మెగా అభిమానులు శంకర్ సినిమా విడుదల తేదీ గురించి అడిగారు. అప్పుడు శంకర్ సినిమా ఫైనల్ కట్ పూర్తయ్యాక విడుదల తేదీ గురించి ఆలోచిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ పాత్ర ఉండే షూటింగ్ భాగం కూడా పూర్తయిపోయింది. దీంతో సినిమా రిలీజ్ గురించి అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది.
తాజాగా ధనుష్ హీరోగా నటించిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని అడగగా దిల్ రాజు క్రిస్మస్ కి కలుద్దాం అని చెప్పారు. దీంతో ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదల అవ్వచ్చు అని టాక్ మొదలైంది.
అయితే భారతీయుడు 2 సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం మీద కూడా చాలానే సందేహాలు మొదలయ్యాయి. శివాజీ తర్వాత శంకర్ చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక భారతీయుడు 2 సినిమా మీద అభిమానులు సైతం ట్రోల్ చేశారు. కాబట్టి ఇలాంటి సమయంలో గేమ్ చేంజర్ విడుదల అవ్వక పోవడమే మంచిది అని మెగా అభిమానులు కూడా అనుకున్నారు.
ఎందుకంటే భారతీయుడు 2 సినిమా తర్వాత చాలామందికి శంకర్ దర్శకత్వం మీదే నమ్మకం పోయింది. మరి గేమ్ చేంజర్ సినిమా విడుదల సమయానికి భారతీయుడు 2 సినిమాకి వచ్చిన నెగెటివిటీ మొత్తం పోతుందా లేదా అనేది వేచి చూడాలి.