Gaami: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గామి’. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తికావడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో చెబుతూనే వచ్చింది. ఈ మూవీ నుండి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా, అతనికి గతం కూడా గుర్తుండదు. అతనికి మనిషి స్పర్శ తగలకూడదు. తగిలితే ప్రాణం పోయినట్టు అవుతుంది. కొన్నాళ్లుగా ఆశ్రయం ఇచ్చిన అఘోరా ఆశ్రమం శంకర్ వల్ల తమకు చెడు అని అతన్ని పంపించేస్తారు. దీంతో అతన్ని ఆశ్రమంలో జాయిన్ చేసిన కేదారి బాబాని వెతుక్కుంటూ కుంభమేళాకు వెళ్తాడు. బాబా చనిపోయినా ఇతని జబ్బు పోగొట్టే మాలపత్రాలు హిమాలయాల్లో ఓ చోట దొరుకుతాయని మ్యాప్ అతని శిష్యుడు ఇస్తాడు. అదే మాల పత్రాల కోసం జాహ్నవి (చాందిని చౌదరి) కూడా ఇతనితో కలిసి హిమాలయాలకు బయలుదేరుతుంది. మరోవైపు ఓ ఊళ్లో దుర్గా (అభినయ) అనే దేవదాసి, తన కూతురు ఉమా (హారిక పెద్ద) కథ నడుస్తుంది.
దుర్గకి హెల్త్ బాగోకపోవడంతో ఆమెని దేవదాసిగా తప్పించి ఉమాని పెట్టాలనుకుంటారు. మరోవైపు హిమాలయాల్లో ఎక్కడో బయటకు కూడా రాలేని ఓ కర్మగారంలో డాక్టర్ భక్షి మనుషుల మీద, వారి మెదడుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అక్కడ CT-333 అనే ఓ వ్యక్తి (మొహమ్మద్ సమద్) తప్పించుకొని వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి శంకర్ కి, జాహ్నవికి ఆ మాల పత్రాలు దొరికాయా? ఉమా దేవదాసి వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంది? ఆ డాక్టర్స్ నుంచి ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? అసలు వీరు ముగ్గురికి లింక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
గామి కథను చెప్పుకోవడానికి క్లిష్టంగానే ఉంటుంది. మనకు చూడటానికి మూడు కథల్లా అనిపిస్తుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటన్నది చివరన తెలుస్తుంది. కొంత మంది ఆ ట్విస్ట్ ఏంటి? అసలు జరిగింది ఏంటి? అన్నది ముందే ఊహించేయగలరు. అయితే ఈ గామి అన్నది ఓ జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది. చాలా స్లోగా, నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మూడు కథలను ముక్కలు ముక్కలు చూపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అయితే ఇంటర్వెల్ కార్డ్ మాత్రం చాలా సింపుల్‌గా పడేసినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఊపు మీదున్న ప్రేక్షకుడికి ఆ ఇంటర్వెల్ కార్డ్, ఆ సీన్ అంతగా రుచించకపోవచ్చు.
ఇది 80వ దశకంలో కథ అని అనుకోవచ్చు. దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ వ్యవస్థను పరోక్షంగా విమర్శించినట్టు చూపించాడు. పార్టులు పార్టులుగా కథను డివైడ్ చేసి చూపించాడు కాబట్టి.. కాస్త ముందుకు వెళ్తాం.. మళ్లీ వెనక్కి వస్తాం. అయితే కథలో మాత్రం ఫ్లో మిస్ అవ్వదు. మూడు కథల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు దర్శకుడు అలా మెయింటైన్ చేయిస్తాడు.
సెకండ్ హాఫ్ వచ్చే సరికి కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే తెరపై హిమాలయాలు, త్రివేణి సంగమం, ద్రోణ పర్వతం అంటూ చూపించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సార్లు అది రియల్ లొకేషన్ అనిపిస్తుంది.. ఇంకొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ తెరపై మాత్రం చూడటానికి ఓ విజువల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. ఇక సింహం వచ్చే సీన్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్, నటీనటుల యాక్టింగ్ మీద ప్రేక్షకుడు ఫోకస్ పెడితే.. సెకండాఫ్‌లో టెక్నికల్ టీం చేసిన పనితనానికి ఫిదా అవుతాడు.
క్లైమాక్స్‌ను చాలా నీట్‌గా, ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. హీరో ఇంకా ఏదైనా చేస్తాడేమో అని ఆశించే వారు కూడా ఉంటారు. కానీ దర్శకుడు మాత్రం ఈ కథను శంకర్ కోణంలోంచి, అతని సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనే దారిలోనే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని లాజిక్స్ వదిలేసి.. అలా కాసేపు స్లోగా సాగే కథను భరించగలిగేతే.. గామి అనే అద్భుతాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు.
టెక్నికల్‌గా ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో నిలుస్తుంది. ఓ కొత్త టీం.. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. అంత గొప్ప అవుట్ పుట్ ఎలా తీసుకొచ్చిందా అని షాక్ అవ్వాల్సిందే. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది. పాటలు, ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మ్ంట్ ఇలా అన్నీ అద్భుతంగా తమ పనితనాన్ని చూపించాయి.
అఘోర పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా కనిపించాడు. ఎంతో సెటిల్డ్‌గా నటించాడు. తన స్టైల్‌కు భిన్నంగా నటించి మెప్పించాడు. చాందినీ చౌదరి సైతం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపించదు. ఈ చిత్రానికి ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. దేవదాసి దుర్గగా అభినయ నటన బాగుంది. హారిక, మహహ్మద్, దయానంద్, మయాంక్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు.