సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓవైపు వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తుంటే మరో వైపు నేతల అలకలు జగన్‌కు కాస్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పక్కా వ్యూహాలను అనుసరిస్తున్న జగన్‌కు ఇప్పుడు సొంత మనుషుల అలకలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో విజయానికి ఒక అడుగు దూరంలో ఉండిపోయిన జగన్ ఈ సారి అదే సీన్ రీపీట్ అవుతుందేమోన్న టెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేతల మధ్య సమన్వయం లేకపోవడం అధినేతకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
‘అన్న పిలుపు’ కార్యక్రమంతో పార్టీలో క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఇబ్బందులన్నీ పరిష్కరించిన జగన్‌కు ఇప్పుడు ఇంట్లో తన సొంత మనిషి అలకను తీర్చడం కష్టంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి ఎంత కీలక నేతనో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జగన్‌కు బంధువుతో పాటు పార్టీ కీలక వ్యవహారాలన్ని ఆయనే చూసుకుంటారు. అలాంటి వైవీ సుబ్బారెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటున్నట్టు సమాచారం. మొన్న విజయవాడలో జగన్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహాప్రవేశ కార్యక్రమానికి కూడా వైవీ సుబ్బారెడ్డి హాజరుకాలేదు. గృహప్రవేశ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి హాజరు కాకపోవడం పార్టీలో హాట్ టాఫిక్‌గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించడానికి జగన్ అన్నీ రెడీ చేసుకున్నారు.
తాజాగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్స్‌తో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కూడా వైవీ సుబ్బారెడ్డి హాజరుకానట్లు సమాచారం. పార్టీలో ఉన్న కీలక నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు కానీ వైవీ సుబ్బారెడ్డి మాత్రం రాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. దీంతో పార్టీలో కింది స్థాయి నేతలు కాస్త గందరగోళంలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వైవీ సుబ్బారెడ్డి పార్టీకి ఎమైనా షాక్ ఇవ్వబోతున్నారా? అనే వార్తలు వినిపిస్తున్నాయి.