ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఓ మాజీ మంత్రి బలయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుండి ప్రత్యేక వైద్య బృందం వచ్చి ఆయన్ను బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏళ్ళు. టీడీపీ హయాంలో మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతర పరిణామాల్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. మాణిక్యాలరావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.