బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు తెలియక చేసిన పని అందరినీ టెన్షన్‌కు గురిచేసింది. విమానంలో గాలి రావడంలేదని ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ విండో తెరిచాడు. ప్రయాణికుడి చర్యతో షాక్‌కు గురైన సిబ్బంది వెంటనే గుర్తించి విమానం టేకాఫ్‌కు ముందే విండోను మూసివేయించడంతో పెనుప్రమాదం తప్పింది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన కలకలం రేపింది.
లక్నో వెళ్లడానికి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఉదయం 8 గంటలకు కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. గోవా ఎయిర్‌లైన్ విమానం ఎక్కి.. తనకు కేటాయించిన విండో పక్కన ఉన్న సీట్లు కూర్చున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో అత్యవసర కిటికీ ద్వారానికి ఏర్పాటు చేసిన గ్లాస్ డోర్‌ను పక్కకు జరిపాడు. దీనిని గుర్తించిన విమాన సిబ్బంది ప్రయాణికుడిని హెచ్చరించి.. విండో మూసివేశారు. సునీల్‌ను విమానంలో నుంచి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. తాను మొదటిసారిగా విమానం ఎక్కానని.. గాలి రాకపోవడంతో విమానం డోర్ తీశానని వివరణ ఇచ్చారు. దీంతో మరో విమానంలో ప్రయాణికుడిని చెన్నైకి పంపించారు.