టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన రచయిత సిరివెన్నెల. ఆయన కలం నుంచి వచ్చిన పదాల్ని వేరే గాయకులు ఆలపించడం చూశాం. కానీ ఆయనే రాసి, బాణీ కట్టి ఆలపించిన గీతాలూ ఉన్నాయి. అందులో తొలి గీతం ‘కళ్ళు’ సినిమాలోని ‘తెల్లారింది లెగండోయ్…’ పాట.
ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎంవీ రఘు దర్శకత్వంలో రూపొందిన సంచలనాత్మక చిత్రం ‘కళ్ళు’. ఈ సినిమాకు దివంగత ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు. సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల సాహిత్యం సిద్ధం చేసి ఇచ్చారట. ఆ పాటను విన్న ఎస్పీ బాలు… ‘మీరే ఈ పాట పాడండి బాగుంటుంది’ అన్నారట. ఆ మాట విన్న సిరివెన్నెల ‘మీరుండగా నేను పాడటం ఏంటి?’ అని అన్నారట. పాడటానికి తొలుత తటపటాయించిన సిరివెన్నెల… పది సార్లు ప్రాక్టీస్ చేసి పాడేశారట. ఆ తర్వాత ఆ పాట ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆయన తొలిసారిగా‘సిరి వెన్నెల’చిత్రంలో ‘విధాత తలపున’ పాట రాసారు.‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’, ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’, ‘స్వర్ణకమలం’లో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’, శ్రుతి లయలు’లో ‘తెలవారదేమో స్వామీ’, ‘క్షణక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’, ‘మనీ’లో ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’, ‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే, ‘సింధూరం’లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే’, ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’, ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’, ‘గమ్యం’లో ‘ఎంత వరకూ ఎందుకొరకు’, ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’, ‘చక్రం’లో జగమంత కుటుంబం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో దశవతారం, ‘అల వైకుంఠ పురములో’ ‘సామజవరగమన’ ఇలా చెప్పుకొంటే పోతే సీతారామశాస్త్రి పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు, వజ్రాలు ఎన్నో.