ఏపీలో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరస్‌తో బాధపడుతూ సోమవారం మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. మార్చి 30న ఉదయం 11.30గంటలకు చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, గంట వ్యవధిలో మధ్యాహ్నం 12.30గంటలకు ఆ వ్యక్తి చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకిందని వైద్యులు భావిస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన బాధితుడికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అతని కుమారుడు ఇటీవల ఢిల్లీలో జరిగిన మత పరమైన ప్రార్థనలకు హాజరై మార్చి 17న ఇంటికి తిరిగి వచ్చాడని అధికారులు గుర్తించారు. మార్చి 30న అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అదే రోజు అతని తండ్రిని కూడా చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకురాగా, గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు. రోగి మృతి చెందిన అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు స్పష్టం చేశారు. బాధితుడికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నందున ఏ కారణంతో చనిపోయాడనేది ధ్రువీకరించేందుకు ఆలస్యమైందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరితో కాంటాక్ట్ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.