హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ మంటలు పక్కనే ఉన్న మరికొన్ని స్టాళ్లకు వ్యాపించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో నుమాయిష్‌కు భారీగా వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి సందర్శకులను బయటకు పంపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అసెంబ్లీ నుంచి నాంపల్లి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
స్టాళ్లలోని వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్నప్పటికీ సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలికి రాకపోవడంతో మంటలు చుట్టు పక్కలకు వ్యాపించాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లలో ఎక్కువగా వస్త్ర, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉండటంతో క్షణాల్లో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకునే లోపే దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
నుమాయిష్‌లో అగ్నిప్రమాద ఘటనతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నుమాయిష్‌లో మొత్తం 2500 స్టాల్స్ ఉండగా.. ప్రమాద సమయంలో అక్కడ 20వేల మందికి పైగా ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.వీరంతా ఒక్కసారిగా ఎగ్జిబిషన్ మైదానం నుంచి బయటకు రావడంతో నాంపల్లి గాంధీభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిక్కెట్టు లేకపోయినా సందర్శకులకు మెట్రోలో ప్రయాణించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. 70 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి నిర్వాహకులు తెలిపారు.