బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలిసిందే. అందులోనూ మహిళా ఫ్యాన్స్ కూడా ఆయనకు ఎక్కువే. ఆయన బయట ఎక్కడ కనిపించినా.. ఆయన చుట్టూ గుమిగూడి సెల్ఫీలు, ఫోటోల కోసం వాళ్లు ఎగబడటం తెలిసిందే.
ఇటీవల సల్మాన్‌కు ఇటువంటి అనుభవం ఎదురైంది. ఆల్‌టైమ్ ఫెవరేట్ మూవీ అయిన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ముంబైలోని లిబర్టీ థియేటర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. చిత్ర బృందం ఏర్పాటుచేసిన ఈ షోకు సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన సల్మాన్, మాధురీ దీక్షిత్‌తోపటు పలువురు నటులు, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ షో సందర్భంగా థియేటర్ వద్ద సల్మాన్ అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ మహిళా అభిమాని ఆయనను చేయిపట్టి లాగింది. సల్వార్ సూట్ ధరించిన ఆమె.. సల్మాన్‌తో మాట్లాడుతూ.. ఆయన వెళ్లిపోతుండటంతో చేయిపట్టి తనవైపు లాగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకొని ఆమెను పక్కకుతప్పించారు. ఈ అనూహ్య ఘటనతో సల్మాన్ ఒకింత అసహనంగా కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.