ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి సినీ పరిశ్రమ, బుల్లితెరకు షరతులతో అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని కోరారు. ఈ విషయంపై ఆయన ఆదివారం ఒక లేఖ పంపించారు. అందులో.. లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో సినీ పరిశ్రమలో పనులు నిలిచిపోయి 50 రోజులు దాటిందని పేర్కొన్నారు. ఒకప్పుడు 100 రోజులు, సిల్వర్‌జూబ్లీ, డైమండ్ జూబ్లీ కార్యక్రమాలతో కళకళలాడిన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ‘లాక్‌డౌన్‌తో 50 రోజులు’అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 17 పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు చిత్ర పరిశ్రమకు, బుల్లితెరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని కోరారు. రీ రికార్డింగ్, డబ్బింగ్ వంటి నిర్మాణానంతర పనులకు, అలాగే బుల్లితెర చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తద్వారా సమాఖ్యలోని 40, 50 శాతం కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆకలి తీర్చే అవకాశం దక్కుతుందన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను తప్పకుండా పాటిస్తామనా ఆయన అన్నారు.