డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్సైట్ రాసిన కథనంపై అసహనం వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు దర్శకుల సంఘం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చిన్న స్కిట్ వేశారు. అయితే స్కిట్లో దర్శకుల నటనను విమర్శిస్తూ ఓ వెబ్సైట్ కథనం రాసింది. దీన్ని చూసిన హరీష్ కాస్త ఘాటుగా సమాధానం చెప్పారు.
‘డియర్ వెబ్సైట్.. దర్శకులుగా మేం కెమెరా వెనుక ఉంటే బాగుంటుందని మాకు తెలుసు. కానీ మమ్మల్ని విమర్శించే ముందు.. ఈ స్కిట్ మేం అవసరాల్లో ఉన్న దర్శకులకు విరాళాలు సేకరించేందుకు వేశామన్న సంగతి తెలుసుకోండి. మా సినిమాల రివ్యూలను స్వేచ్ఛగా రాయండి.. అంతేకానీ ఓ మంచి ఉద్దేశంతో ఐకమత్యంతో మేం చేసే కార్యక్రమాల రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని హరీష్ ట్వీట్ చేశారు.