రాజధాని అమరావతిలో 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు, నిరసనలు తెలిపారు. వివిధ పార్టీలు, అమరావతి జేఏసీ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి అంతా అట్టుడికిపోయింది. రాజధానిలోని 29 గ్రామాల రైతులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఎక్కడికక్కడే ఆందోళనకు దిగిన రైతులను, మహిళలను, పార్టీల నాయకులను, జేఏసీ నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రాజధాని గ్రామాల ప్రజలు పొలాల మీదుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. రాజధాని అమరావతిని తరలించొద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
అసెంబ్లీని ముట్టడించిన మహిళలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జికి దిగారు. పోలీసులను లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో మహిళలు, రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్లపై రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నిన్నటి నుంచి పలువురు రాజకీయ పార్టీలను ఎక్కడికక్కడే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతిలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. రాజధానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదింపుతూ..
మూడు రాజధానులకు నేడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.