బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర జరగడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సల్మాన్ ను చంపడానికి ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తెలియడంతో సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. షార్ప్ షూటర్ రాహుల్ ను ఉత్తరాఖండ్‌లో ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. సల్మాన్ ఖాన్ ను చంపే బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్ రాహుల్ కు అప్పగించాడని, రాహుల్ గత జనవరిలో ముంబై వచ్చి సల్మాన్ ఖాన్ నివాసముండే బాంద్రాలో మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. ఇదిలా ఉండగా ఫరీదాబాద్‌లో ప్రవీణ్ అనే యువకుడిని రాహుల్ హత్య చేయగా.. ఆ కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
రాహుల్ ను విచారించిన పోలీసులకు షాకింగ్ నిజాలు చెప్పాడు . స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేందుకు రెక్కీ నిర్వహించినట్లు రాహుల్ అంగీకరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను ఆరాధిస్తుంది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినప్పటినుంచి. ఆయనపై ఈ జాతికి చెందిన కొందరు కోపం పెంచుకున్నారు. సల్మాన్ ఖాన్ పై శత్రుత్వం పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్ రెండు సార్లు హత్యకు ప్రయత్నించినట్టు పోలీసులకు తెలిపాడు.