బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కమెడియన్ హీరో సంపూర్ణేష్ బాబు తన మొదటి చిత్రంతో పడ్డ పాట్లు గురించి మీడియాకు వివరించాడు. తన మొదటి చిత్రం హృదయ కాలేయం సినిమా విడుదలైన తర్వాత జనాలు ఫోన్లు చేసి బండబూతులు తిట్టేవారట. హృదయ కాలేయం సినిమా గురించి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ట్వీట్ చేశాక విమర్శలు ఆగాయని చెబుతున్నాడు సంపూ.
వైరస్ సినిమా ఫ్లాప్ అయ్యింది. హిట్ అనేది మన చేతుల్లో లేదు. ప్రేక్షకులు ఏదిస్తే.. దాన్నే తీసుకోవాలి. నేను కథల ఎంపిక గురించి ఇప్పటి వరకు అంత స్పష్టంగా ఆలోచించలేదు. కాస్త జాగ్రత్తగా ఎంచుకోవాలి అనుకుంటాను. కరెంటు తీగ సినిమా మోహన్‌బాబు గారి బ్యానర్లో కావడంతో అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఇక కొబ్బరిమట్ట, హృదయ కాలేయం మేకర్స్ తీస్తున్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కొబ్బరిమట్ట చిత్రంలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే జనాల్లో పాజిటివ్ బజ్ వస్తోంది. 3 నిమిషాలకు పైగా సింగిల్ షాట్లో డైలాగ్ చెప్పి రికార్డ్ బ్రేక్ చేసిన సంపూ అందరినీ ఆకట్టుకున్నాడు. మరి మిగతా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.