నేచురల్ స్టార్ నాని కొత్త ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీయబోతున్న సినిమాలో ఆయన నటించనున్నట్లు చెప్పుకొచ్చారు. నానికి కథ నచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని రాశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుందని, ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని ఊహాగానాలు వచ్చాయి. కాగా ఇదే వార్తను నాని అభిమానులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నాని తర్వాతి సినిమా ఇదేనని వివరాల్ని షేర్ చేశారు. దీన్ని చూసిన నాని స్పందించారు. ‘అది నిజం కాదు మై బాయ్స్’ అని ట్వీట్ చేశారు.
‘జెర్సీ’ హిట్ తర్వాత నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ‘వి’ అనే సినిమాలోనూ నాని హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్‌లు.