HomeTelugu Reviews'ఎఫ్‌3' రివ్యూ

‘ఎఫ్‌3’ రివ్యూ

F3 Movie Review

విక్టరీ వెంకటేశ్‌, హీరో వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ని తీసుకొచ్చాడు అనిల్‌ రావిపూడి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా నేడు శుక్రవారం(మే27) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ఎఫ్‌3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్‌3 ఏమేరకు అందుకుంది? వెంకటేశ్‌, వరుణ్‌ల కామెడీ మరోసారి వర్కౌట్‌ అయిందా? హిట్‌ కాంబినేషన్‌గా పేరొందిన అనిల్‌, దిల్‌రాజు ఖాతాలో విజయం చేరిందా లేదా? ప్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుందో.. రివ్యూలో చూద్దాం.

కథ: ఎఫ్‌2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్‌ రావిపూడి.. ఎఫ్‌3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు. ఈ సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. వెంకీ(వెంకటేశ్‌) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సవతి తల్లి పోరుతో పాటు ఇంటినిండా సమస్యలు. వీటీని దూరం చేసేందుకు అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇక అవారాగా తిరిగే వరుణ్‌ యాదవ్‌(వరుణ్‌తేజ్‌) కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. దీని కోసం బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు హనీ(మెహరీన్‌) కూడా తన కుటుంబ సమస్యలు తీర్చడం కోసం ధనవంతున్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా ఇద్దరు ధనవంతులని అబద్దం చెప్పి ఒకరికొకరు దగ్గరవుతుంటారు. ఇక వరుణ్‌ని ధనవంతుడిగా నటింపజేసేందుకు వెంకీ తన ఇల్లుని తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందిస్తుంటాడు.

F3 Review

చివరకు హనీ ధనవంతుడి కూతురు కాదని తెలుస్తుంది. దీంతో ఈజీగా కోటీశ్వరులవుదామనుకునే వారి ఆశ అడియాశలైపోతాయి. అంతేకాదు వెంకీ, వరుణ్‌ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. చివరకు తమకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌ (మురళీ శర్మ)గురించి తెలుస్తుంది. అతని కొడుకు చిన్నప్పుడే పారిపోయాడని, వారసుడి కోసం ఆనందప్రసాద్‌ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడని తెలిసి.. వెంకీ అతని కుమారుడిగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అదేసమయంలో వరుణ్‌తో పాటు మరో ఇద్దరు కూడా నేనే వారసుడిని అని ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరిలో ఆనందప్రసాద్‌ వారసుడు ఎవరు? డబ్బు మీద అత్యాశ ఉన్న వీళ్లకు ఆనందప్రసాద్‌ ఎలా బుద్ది చెప్పాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు : వెంకటేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్‌ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక వెంకటేశ్‌తో పోటాపోటీగా నటించాడు వరుణ్‌ తేజ్‌. నత్తి ఉన్న వరుణ్‌ యాదవ్‌ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్‌ బాగా పేలాయి. మంగ టిఫిన్‌ సెంటర్‌ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా మెహ్రీన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది. సీఐ నాగరాజుగా రాజేంద్రప్రసాద్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. వరుణ్‌ స్నేహితుడు కత్తి శీనుగా సునీల్‌ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

F3 Review 1
విశ్లేషణ : ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే జనాలు పొట్టచెక్కలయ్యే కామెడీ పక్కా అని ఫిక్స్‌ అయ్యేవారు ప్రేక్షకులు. ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. ఎఫ్‌2తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్‌ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ఎఫ్‌3లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్‌ చూపించి.. చివరిలో మంచి సందేశాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో కామెడీనే ఆస్వాదించాలి తప్ప.. స్టోరీ పెద్దగా ఉండదు. ఇక లాజిక్‌ లెక్కలను అసలే పట్టించుకోవద్దు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘లాజిక్‌ అని, రియలిస్టిక్‌ అని మమ్మల్ని ఎంతకాలం దూరంపెడతారు రా’ అని పోలీసు వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో ఓ డైలాగ్‌ చెప్పించి.. తమ మూవీలో అవేవి ఉండవని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ పండించాడు. రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌తేజ్‌ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.

ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్‌ పడే పాట్లతో ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ముఖ్యంగా ‘వెంకట్రావు పెళ్లాన్ని చూశా..’ అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌కు ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురేట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. మేమే ఆనందప్రసాద్‌ నిజమైన వారసులం అంటూ వెంకీ, వరుణ్‌ పండించే ఫన్‌ హైలెట్‌. వీరితో హారిక(తమన్నా) కూడా పోటీ పడడం.. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టడం ఇలా ప్రతీ సీన్‌ నవ్విస్తుంది. ముఖ్యంగా ‘ఆంబోతు’ సీన్‌ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. ఎఫ్‌3 టాయ్స్‌ అంటూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను తెరపై చూపించడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. ఇక క్లైమాక్స్‌లో వెంకీ, వరుణ్‌ల ఫైట్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. వారి గెటప్‌లకు, చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకుడు నవ్వుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు. లాజిక్‌ని పక్కకు పెట్టి, హాయిగా నవ్వుకోవడానికి అయితే ఎఫ్‌3 మూవీ చూడొచ్చు. టికెట్ల రేట్లు పెంచకపోవడం ఎఫ్‌3కి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.

టైటిల్‌ : ఎఫ్‌3
నటీనటులు : వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌, రాజేంద్రప్రసాద్‌, అలీ సునీల్‌ తదితరులు
దర్శకత్వం:  అనిల్‌ రావిపూడి
నిర్మాతలు: దిల్‌ రాజు, శిరీష్‌
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌

హైలైట్స్‌‌: కామోడీ
డ్రాబ్యాక్స్‌: కథ తెలిసినదే..కావటం
చివరిగా: ఎఫ్-2 కామెడీ కంటిన్యూ..
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu