‘f2’ ఆడియో విడుదల వేడుక వైజాగ్‌లో ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్, వరుణ్‌తేజ్, దేవిశ్రీ ప్రసాద్, దిల్‌రాజు వేదికపై సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌తో అనేక మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడే ‘స్వర్ణకమలం’, ‘సుందరకాండ’, ‘గురు’ తీశాం. ఇదే బీచ్‌లో ‘మల్లీశ్వరి’ కత్రినాకైఫ్‌తో కలిసి అలా నడిచాను. ఈ సినిమా వినోదభరితంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి (సినిమాలో) మా భార్యలు తమన్నా, మెహరీన్ రాలేదు (నవ్వుతూ). సంక్రాంతికి చిత్రం విడుదల కాబోతోంది. ఇదే సమయంలో తమ సినిమాలతో వస్తున్న బాలయ్య, చరణ్, రజనీలకు ఆల్ ది బెస్ట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలి’ అని అన్నారు.
వైజాగ్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే నేను నటన నేర్చుకున్నా. కాబట్టి నా హృదయానికి ఈ ప్రాంతం చాలా దగ్గర. గంటా శ్రీనివాసరావు గారు మా కుటుంబానికి ఆప్తులు. ఏ కార్యక్రమం అయినా ఆయన పిలవగానే వస్తుంటారు. ఆయనకు ధన్యవాదాలు. రాక్‌స్టార్ దేవిశ్రీతో తొలిసారి కలిసి నటించా. ఆయనతో కలిసి మరో సినిమా కోసం పనిచేయాలని ఉంది. వెంకటేష్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో ప్రయాణం బాగా జరిగింది’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. ఈ మల్టీస్టారర్‌కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.