తమిళ నటి ఆత్మిక తనను పురుషులతో పోల్చుతూ విమర్శించిన ఓ నెటిజన్‌కు సరైన బుద్ధి చెప్పారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ముగ్గురు తమిళ నటులు మహిళ వేషం వేసుకుని ఉన్న ఫొటోల్ని ఆత్మిక ఫొటోను జత చేసి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని చూసిన ఆత్మిక ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో స్పందిస్తున్నానని ఓ పోస్ట్ చేశారు. ‘ప్రియమైన సోదరుడా.. ముందు ఈ ఫొటోలోని లెజెండ్స్‌తో నన్ను పోల్చినందుకు ఆనందంగా, గొప్పగా ఉంది. మరో విషయం ఏంటంటే.. ఈ స్పందన నీకు మాత్రమేకాదు.. నీలా ఆలోచించే వారందరికీ వర్తిస్తుంది’.
‘ఈ ఫొటో చూసి నేను బాధపడుతాను అనుకున్నావా? లేదా ఫన్నీగా ఉందనుకుంటాను అనుకున్నావా? నాకు ఆ రెండూ అనిపించలేదు. చిన్నతనం నుంచి నీ ఆలోచనలు ఇలానే ఉన్నాయేమో. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నాకు తెలుసుకోవాలి అనిపిస్తోంది. నువ్వు చూడటానికి హృతిక్ రోషన్‌లా ఉన్నా.. నాకు ఓ వ్యక్తిగా అసహ్యంగానే కన్పిస్తావు. ఎందుకంటే నీకు అందమైన హృదయం లేదు. మరొకర్ని బాధపెట్టడమే సంతోషం అనుకుంటున్నావు. అందం అనేది మనసును బట్టి ఉంటుందని నువ్వు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నా’.
ఇలా వివిధ విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న మహిళల కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి.. ఓ మహిళగా నువ్వు అంటుంటే వింటూ కూర్చోలేను. దీని తర్వాత మరో మహిళకు ఇలా జరగకూడదు. ఓ మహిళ ఎలా ఉండాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టి-పొడవు, నలుపు-తెలుపు, లావు-నాజూకు, అందం-అసహ్యం, మహిళలా ఉందా, పురుషుడిలా ఉందా.. అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు ఓ పురుషుడు ఇలా ఉండాలని ఎప్పుడూ అనుకోదు. మమ్మల్ని గౌరవించే విధానం మాకు ముఖ్యం. నీ కుటుంబంలో ఉన్న అమ్మ, సోదరి, ఇతర మహిళల్ని జాగ్రత్తగా చూసుకో, వార్ని వారిలానే స్వీకరించు. ఆత్మస్థైర్యం, భయం లేకపోవడం, ముక్కుసూటిగా ఉండటం నా బ్యూటీ. నా వల్ల ఇవాళ నువ్వు ఫేమస్ అయ్యావు సోదరుడా. ఇన్నాళ్లూ నువ్వు దీని కోసమేగా కష్టపడ్డావు’ అని ఆత్మిక నెటిజన్‌ను మందలించారు. ఆమె కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు పొందారు. ‘మీసయ మురుక్కు’, అరవింద స్వామి ‘నరగాసురన్’ తదితర చిత్రాల్లో నటించారు.