సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమంలో సందడి చేశారు. సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చే ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు తారలు విచ్చేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్‌బాబు పాల్గొని అంతకుమించి ఎంటర్‌టైన్ చేశారు. త్వరలోనే ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 39 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కనుల పండగలా సాగింది. ఈ ఇద్దరు హీరోల సంభాషణలు విశేషంగా అలరించాయి. ‘సరైన సమాధానమే కదా… దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు?’ అని మహేశ్‌బాబు అడిగితే ‘ఏదో సరదాగా’ అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు. ఆ వెంటనే ‘నీకన్నా గురువుగారే (కంప్యూటర్) బెటర్‌గా ఉన్నారు’ అని మహేశ్.. ఎన్టీఆర్‌తో పాటు షోలో ఉన్న వారందరినీ నవ్వించారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.