HomeTelugu Big Storiesఎవరు మీలోకోటీశ్వరులులో ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ సందడి

ఎవరు మీలోకోటీశ్వరులులో ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ సందడి

Evaru meelo koteeswarulu at
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కోసం అభిమానులు ఎంతగానో వేచి చూశారు. కర్టెన్ రైజర్‌గా తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. తొలిరోజు రామ్‌చరణ్‌ అతిథిగా విచ్చేసి సందడి చేశారు.

‘‘తెర మీద మీకు కనిపించి మూడేళ్లు అవుతోంది. మీకొక అద్భుతాన్ని అందించాలని దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అందులో పాత్రధారిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే ఓ చరిత్రను ఆవిష్కరిస్తుంది మా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం. ఈలోగా మీ ప్రేమ, అభిమానాన్ని పొందాలని ఈ షో ద్వారా మీ ముందుకొచ్చాను. కొన్ని నెలల క్రితమే ఈ షో రావాలి. కరోనా కష్టం వచ్చి పడింది. కష్టమంటే నాకు గుర్తొచ్చేది.. మహాకవి శ్రీశీ రచన. ‘దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే’’ అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని ఎన్టీఆర్‌ తనదైన శైలిలో వినిపించారు. గుక్క తిప్పుకోకుండా తారక్‌ కవిత్వం చెప్పడంతో కార్యక్రమంలో చప్పట్లు మార్మోగాయి.

‘ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది’ అంటూ హుషారుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్‌. రామ్‌ చరణ్‌ రాకతో ఆ ఉత్సాహం మరింత రెట్టింపైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన ‘ఏవీ’తోనే చరణ్‌ని ఆహ్వానించారు. సంస్కారానికి ప్రతిరూపం, స్నేహానికి నిలువెత్తు రూపం, నా అన్న రామ్‌చరణ్‌కి స్వాగతం అంటూ రామ్‌ చరణ్‌కి వెల్‌కమ్‌ చెప్పారు. త్వరలో వెండితెరపై చూడాల్సిన ఈ ఇద్దరినీ ఇలా బుల్లితెరపై ముందుగానే చూడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షో ఆద్యంతం వీరి మధ్య సాగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.

‘‘కుక్క‌లు పెంచుకోవ‌డమంటే నాకెంతో ఇష్టం. ప్ర‌స్తుతం నా దగ్గ‌ర 6 కుక్క‌లు ఉన్నాయి. వాటితోపాటు గుర్రాల‌ను పెంచుకోవ‌డం కూడా ఇష్ట‌మే. నా దగ్గ‌ర ఉన్న గుర్రాల‌లో ఒక‌ దాని పేరు బాద్ షా. ‘మ‌గ‌ధీర‌’లో అది మీ అందరికీ క‌నిపిస్తుంది. అదే సినిమాలో మ‌రో గుర్రాన్నీ చూపించారు. దాని పేరు కాజ‌ల్‌. నా స్నేహితుడు చ‌నిపోయే ముందు ఆ గుర్రాన్ని నాకు ఇచ్చాడు. అది నాకు ఎంతో స్పెష‌ల్‌. దాని క‌ళ్లు చాలా న‌ల్ల‌గా, షార్ప్‌గా ఉంటాయి. అందుకే దాని పేరు కాజ‌ల్‌. ‘మ‌గ‌ధీర’ కంటే ముందే అది నా దగ్గరకు వ‌చ్చింది. అయితే మ‌గ‌ధీర విడుద‌ల‌య్యాక హీరోయిన్ పేరు కూడా కాజ‌లే కావ‌డంతో నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది. (న‌వ్వులు)’’ అంటూ చెప్పుకొచ్చారు రామ్‌చరణ్‌.

‘‘జీవితంలో కొన్ని బంధాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది త‌క్కువే అవుతుంది. కొందరితో ఉన్న అనుబంధాన్ని బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది. ఆ అనుబంధాల‌ను బ‌య‌ట‌పెడితే దిష్టి త‌గులుతుందేమోన‌ని నేను న‌మ్ముతాను. అలాంటి అనుబంధ‌మే నాకు పవన్‌ బాబాయ్‌కు మధ్య ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి నేనే బయట ఎక్కువగా మాట్లాడను. నా చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌తో నాకు ఉన్న రిలేష‌న్ మాట‌ల్లో చెప్ప‌లేనిది. నాన్న షూటింగ్స్ లో బిజీగా ఉంటే అమ్మ కూడా ఆయ‌న‌తో పాటు లొకేష‌న్‌కి వెళ్లేది. దాంతో బాబాయే మా ముగ్గుర్ని ద‌గ్గరుండి జాగ్ర‌త్త‌గా చూసుకునేవారు. ట్యూష‌న్స్‌లో స‌రిగ్గా చ‌దువుకోక‌పోతే మ‌మ్మ‌ల్ని మంద‌లించేవారు. మేం పెద్ద‌య్యాకా నాన్న నాతో డైరెక్ట్‌గా చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను బాబాయ్ ద్వారా మాకు చెప్పించేవారు. ఆయ‌న నాకో సోద‌రుడు, బాబాయ్‌, చిన్న తండ్రి’’ అంటూ పవన్‌తో అనుబంధాన్ని వివరించారు.

‘‘తార‌క్.. నువ్వు గురువు గారు.. గురువు గారు అంటున్న‌ప్పుడ‌ల్లా నువ్వు న‌టించిన ‘అదుర్స్’ సినిమా గుర్తుకు వ‌స్తోంది. ఆ సినిమా నాకెంతో న‌చ్చింది. నేను ఎన్నోసార్లు చూశాను. బాగా న‌వ్వుకున్నాను. అందులో నీ కామెడీ టైమింగ్‌, పంచ్‌లు అదుర్స్ అనిపించేలా ఉంటాయి. ఇప్ప‌టికీ నాకు ఎప్పుడైనా డ‌ల్‌గా అనిపిస్తే వెంట‌నే ‘అదుర్స్’ చూస్తా’’
‘‘సాధార‌ణంగానే నాన్న సినిమా షూటింగ్స్‌కి వెళ్లిన‌ప్పుడు నేను ఫుల్ టెన్ష‌న్ ప‌డ‌తాను. అలాంటిది ఆయ‌న‌తో ‘ఆచార్య’ చేస్తున్న‌ప్పుడు చాలా కంగారుగా అనిపించింది. సెట్‌లో ఆయ‌న్ను చూసిన‌ప్పుడు స్కూల్లో ప్రిన్సిప‌ల్‌తో ఉన్న‌ట్లు అనిపించింది. నా జీవితంలోనే కాకుండా నా కుటుంబం మొత్తానికీ ‘ఆచార్య’ ఎంతో స్పెష‌ల్‌. నాన్న‌తో క‌లిసి స్క్రీన్ పంచుకోవ‌డాన్ని జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఇలాంటి ఒక గొప్ప అవ‌కాశాన్ని నాకు క‌ల్పించిన మా డైరెక్ట‌ర్‌.. నీ డైరెక్ట‌ర్‌.. మ‌న డైరెక్టర్ కొర‌టాల‌ శివ‌కు పెద్ద థ్యాంక్స్‌. కేవ‌లం 15 నిమిషాల పాత్ర‌గా ప్రారంభ‌మైన సిద్ధ పాత్ర.. సుమారు ఓ ఫుల్ లెంగ్త్ పాత్ర‌గా ఆయ‌న తీర్చిదిద్దారు’’ అని రామ్‌ చరణ్‌ వివరించారు.

‘‘కొమురం భీమ్ పాత్ర‌లో మీకు ఎన్నో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు ఉంటాయి. స్క్రీన్‌పై తార‌క్‌ని చూసి మీ అందరూ ఫిదా అయిపోతారు. ఆ మేజిక్‌ని నేను ఇప్పుడు చెప్ప‌ను. త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా మీ అంద‌రూ వెండితెర‌పై చూస్తారు’’ అంటూ ఎన్టీఆర్‌ పాత్రపై ఆసక్తిని రెట్టింపు చేశారు రామ్‌ చరణ్‌. ‘‘కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించ‌డం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ సినిమా షూట్‌లో మ‌నం ఎంతో క‌ష్టప‌డ్డాం. అల్లూరి సీతారామ‌రాజుగా నువ్వు.. కొమురంభీమ్‌గా నేను ఎంత క‌ష్ట‌ప‌డ్డామో తెలుసుగా. అలాంటి గొప్ప పాత్రల్లో మ‌నం న‌టించామంటే నిజంగా మ‌న పూర్వజ‌న్మసుకృతం’’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విశేషాలను పంచుకున్నారు ఎన్టీఆర్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu