తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధును సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, సింధు కుటుంబసభ్యులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. పారా షట్లర్ మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో సింధు కచ్చితంగా స్వర్ణం సాధిస్తారని ఆకాంక్షించారు. పారా షట్లర్ మానసి, ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక అని, ఎంతో మందికి ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.