లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి వీరిద్దరూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మండ్యలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సుమలత, నిఖిల్ గౌడల సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం చేయకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఈ నిషేధం వర్తించకపోవడం గమనార్హం.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం ఆసక్తికర పోరుకు వేదికైంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో సుమలత భర్త, కాంగ్రెస్ నేత అంబరీష్ పలుసార్లు ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అనారోగ్యంతో గతేడాది అంబరీష్ మరణించారు. దీంతో ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రానున్న ఎన్నికల్లో సుమలత మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీటు ఆశించారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటును కాంగ్రెస్ తమ మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అటు సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ ఈ ఎన్నికలతో రాజకీయ ప్రవేశానికి సిద్దమయ్యారు. దీంతో తమకు కంచుకోట అయిన మండ్య నుంచి నిఖిల్‌ను జేడీఎస్ పోటీకి దింపుతోంది. ఈ నేపథ్యంలో మండ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరి నేటి తరం నటుడిపై నాటితరం కథానాయిక నెగ్గుతారో వేచి చూడాల్సిందే.