ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు సహా పోలింగ్ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు హరిప్రసాద్‌తో చర్చించేందుకు అభ్యంతరం తెలిపింది. హరిప్రసాద్‌పై కేసు ఉన్న కారణంగా ఆయనతో చర్చించబోమని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే మాత్రం చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది. అందుకోసం ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవవచ్చని టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానంగా లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం సీఈసీ సునీల్ అరోడాతో ఏపీ సీఎం చంద్రబాబు సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ వ్యవహరించిన తీరు ఎంత ఆక్షేపణీయంగా ఉందో అర్థమవుతుందా.. అంటూ నిలదీశారు. ఈసీ ఓ స్వతంత్ర వ్యవస్థగా కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా పనిచేస్తోందంటూ సీఎం మండిపడిన విషయం తెలిసిందే.