సూపర్‌గుడ్ ఫిలింస్ 90వ సినిమా `ద్వారక` టీజర్..
సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వారక`. `పెళ్లిచూపులు` ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడు. పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణాష్టమి సందర్భంగా.. సమర్పకుడు ఆర్.బి.చౌదరి ఈ సినిమా మోషన్ పోస్టర్, సాంగ్ (భజరే నందగోపాల హరే..) టీజర్‌ని లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో …
ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ -“ఇది మా బ్యానర్ నుంచి వస్తున్న 89వ సినిమా. ఎంతోమంది నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను పరిచయం చేశౄం. అదే కోవలో ఈ సినిమాతో కొత్త నిర్మాతలు ప్రద్యుమ్న-గణేష్‌లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు నిర్మించాం. అలాగే శ్రీనివాస్ రవీందర్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడిని పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. సాయికార్తిక్ అందమైన సంగీతం అందించాడు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో సినిమా రిలీజ్ చేయనున్నాం“ అన్నారు.
నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ -“20 ఏళ్ల క్రితం ప్యాషన్‌తో సినీపరిశ్రమకి వచ్చాను. లక్కీగా ఆర్.బి.చౌదరి వంటివారి అండ లభించింది. ఎంతోమంది లైఫ్‌ని త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడుతుంటారు. సినిమా అనేది సామాజిక బాధ్యత. విజ్ఞానంతో తీయాలి. నిర్మాతలకు ఆ తెలివితేటలు, నాలెజ్ ఉండాలి. 90 సినిమాలు తీసిన నిర్మాత ఆర్.బి.చౌదరి గారు మా వెన్నంటి నిలవడం నా అదృష్టం. ఆయన మాపై పెద్ద బాధ్యత ఉంచారు. 24 శాఖలకు సంబంధించిన కుటుంబాలు పరిచయం కావడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా కథని నమ్మి హీరో ఓకే చెప్పారు. సుప్రీం వంటి పెద్ద సినిమాలు చేసిన సాయి కార్తిక్ అండగా నిలిచి సంగీతం అందించారు. శ్యామ్.కె నా వెంటే నిలిచారు. లక్ష్మీ భూపాల్ మాటలకు అవార్డు వస్తుంది. ఈ సినిమాకి సపోర్టు చేసిన అందరికీ పేరు పేరునా వందనాలు“ అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ -“2015లో ఈ సినిమాకి కమిటయ్యాను. కథ విషయంలో ఆర్.బి.చౌదరి గారిని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన్ను ఒప్పించి ఈ సినిమా పూర్తి చేయగలిగాను. తెరపై విజువల్స్ చూసి ఆశీర్వదించండి“ అన్నారు.
మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ -“టాప్ టెక్నీషియన్లతో, ఆర్.బి.చౌదరి గారి అండతో తీసిన సినిమాకి పనిచేయడం సంతోషంగా ఉంది. నాలుగైదేళ్ల క్రితమే ఈ కథను దర్శకనిర్మాతలకు చెప్పాను. పెళ్లి చూపులు హీరో హిట్‌తో ఊపుమీదున్నాడు. ఈ సినిమాతో మరో పెద్ద విజయం అందుకోవాలి“ అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ -“పెళ్లి చూపులు విజయంతో క్షణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే `ద్వరాక` వచ్చేస్తోంది. అందరూ టాప్ టెక్నీషియన్లతో, ఆర్.బి.చౌదరి గారి బ్యానర్‌లో సినిమా అంటే షాక్‌కి గురయ్యాను. మెగా నిర్మాతల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వారక కథ నచ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న కథని నిర్మాతలు ఎంకరేజ్ చేయడం హ్యాపీ. గణేష్ కొరియోగ్రఫీలో వైవిధ్యమైన డ్యాన్సులు వేశాను“ అన్నారు.
నిర్మాత గణేష్, శ్యామ్.కె.నాయుడు, మాజీ ఇన్‌కంట్యాక్స్ కమిషనర్ పార్థసారథి, సాయికార్తిక్, బ్రహ్మకడలి, పూజా జవేరి, పి.హరికృష్ణ, గిరిధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.