మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువనటుడు దుల్కర్ సల్మాన్, హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ జంటగా ఓ మలయాళీ రొమాంటి సినిమా రూపొందించారు. ఈ సినిమాను తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో విడుదలవుతోంది. దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగు హక్కులను కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 25వ చిత్రం. ఈ చిత్రంలోని ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ అనే తెలుగు పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి మసాలా కాఫీ సంగీతం అందించగా సామ్రాట్ నాయుడు, పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ సిద్ధార్థ్ క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్ నటించారని తెలిపారు. హీరోకి కల్లీస్ అనే స్నేహితుడు ఉంటాడని, మీరా పాత్రలో హీరోయిన్ రీతూ వర్మ నటించారని ఆమెకు శ్రేయ అని స్నేహితురాలు ఉంటుందని తెలిపారు. మీరాతో సిద్ధార్థ్, శ్రేయతో కల్లీస్ ప్రేమలో పడతారు. లగ్జరీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడిన సిద్ధార్థ్, కల్లీస్ ఏం చేశారు? వాళ్లు చేసిన పనుల వల్ల ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నారనేది మిగతా కథ. ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు అన్నారు. ఈనెల 28న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కె.ఎఫ్.సి. ఎంటర్టైన్ సంస్థ తెలిపింది. ఇంకా ఈ చిత్రంలో రక్షణ్, నిరంజని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించారు.