ప్రముఖ నటుడు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దొరసాని’. యువ నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘దొరసానులు గదుల్లో నుంచి బయటికి వస్తారా రా..’ అంటూ నలుగురు యువకులు.. దేవకి (శివాత్మిక)ను చూసి మాట్లాడుకుంటున్న సంభాషణతో టీజర్ మొదలైంది. రాజు (ఆనంద్).. దేవకిని ఇష్టపడటం, ఈ విషయం తెలిసి ఊరి పెద్దలు రాజుని చావగొట్టిన సన్నివేశాలతో టీజర్‌ను ఉత్కంఠభరితంగా చూపించారు. సురేశ్ ప్రొడక్షన్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.