భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అహ్మదాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. సోమవారం మొతేరా స్టేడియంలో కిక్కిరిసిన జనాల మధ్య ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసల్లో ముంచెత్తడంతో పాటుగా.. భారతీయుల శక్తిసామర్థ్యాలను ట్రంప్ కొనియాడారు. ఇక భారతీయ సినిమాలు, క్రీడాకారుల గురించి కూడా.. ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘భారత్ క్రియేటివ్ హబ్. బాలీవుడ్‌లో ఏడాదికి దాదాపు 2000 వేల సినిమాలు నిర్మిస్తారు. భూగ్రహం మీద ఉన్న ప్రజలంతా బాలీవుడ్ సినిమాలను ఆస్వాదిస్తారు. భాంగ్రాను ఇష్టపడతారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి క్లాసిక్ సినిమాలను చూస్తారు. అంతేకాదు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజాలు ఇక్కడి నుంచే వచ్చారు’’ అని ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.
అదే విధంగా… ‘‘గడిచిన డెబ్బై ఏళ్లలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన భారత్.. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలిచింది. నరేంద్ర మోడీ కేవలం గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. కఠిన శ్రమ, నిబద్ధతకు నిదర్శనం. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ప్రపంచలోనే పెద్దదైన, లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న మొతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.