భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశం తర్వాత మోదీ, ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో అనేక కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకున్నట్టుగా ట్రంప్ తెలిపారు. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు అధిగమించాల్సి ఉందన్నారు. వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం రూపుదాల్చనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయడం తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.
అక్కడి నుంచి ట్రంప్ మధ్యాహ్నం సమయంలో యూఎస్ ఎంబసీకి వెళ్లారు. అక్కడి అధికారులతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ట్రంప్ అనేక విషయాలను చెప్పుకొచ్చారు. అమెరికా తీసుకున్న నిర్ణయాల వలన అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని, ఆర్ధికంగా అమెరికా మరింత అభివృద్ధి చెందుతున్నట్టు తెలిపారు. అమెరికా, ఇండియా మధ్య మైత్రి మరింత బలపడినట్టు చెప్పిన ట్రంప్, కరోనా వైరస్ ను ఎదుర్కొనడంలో కృషి చేస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ విషయంలో తాను చైనా
అధ్యక్షుడితో మాట్లాడినట్టుగా కూడా అయన తెలిపారు. ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానని ట్రంప్ చెప్పడం విశేషం. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం తనకు ఉందని, మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిని అవడం ఖాయమని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తే మార్కెట్లు భారీగా పుంజుకుంటాయన్నారు.