ప్రముఖ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ (79)అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారని మీడియాకు వారు వివరించారు.
కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఆయనను వెంటనే ఎమర్జెన్సీకి తరలించామని చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ అందించిన తర్వాత ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతూనే ఉందని… మరో 48 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని అన్నారు. రేపు మధ్యాహ్నం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం కృష్ణ.. నానక్ రామ్ గూడలో నరేశ్ వద్ద ఉంటున్నారు. ఇదే ఇంట్లో విజయనిర్మలతో కలసి కృష్ణ ఉండేవారు. అప్పుడప్పుడు మహేశ్ బాబు తన తండ్రి వద్దకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కృష్ణ కుమారుడు మహేశ్ బాబు, ఆయన కుమార్తెలు, నరేశ్ ఉన్నారు.