తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తులను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. రాష్ట్రం మొత్తంమీద నమోదైన పాజిటివ్ కేసులను కేవలం గాంధీ ఆస్పత్రికే తరలించడంతో అక్కడి వైద్యులపై పనిభారం అధికమవుతోంది. పేషెంట్ల తాకిడితో వైద్యులు అధిక ఒత్తిడిలో పనిచేస్తున్నారని ఓ మహిళా వైద్యురాలి తన ఆవేదనను
వెలిబుచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేయడం అంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా భావించే వైద్యులు ఇప్పుడు గాంధీ ఆస్పత్రి అంటే బాబోయ్ అనే పరిస్థితి తలెత్తిందని అన్నారు.
కరోనా రోగులను కేవలం గాంధీ ఆస్పత్రికే కాకుండా హైదరాబాద్‌లోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా తరలించాలని కోరారు. గత 3 నెలలుగా వైద్యులు పని ఒత్తిడితో ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉందని, వైద్యులపై ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. లేకుంటే గాంధీ ఆస్పత్రిలో వైద్యుల ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పేషెంట్ల బంధువుల దాడి నుంచి తమకు రక్షణ కల్పించాలని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిన్న ఆందోళనకు దిగిన నేపథ్యంలో డా. విజయలక్ష్మి ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సేవలకు గాను వైద్యులపై హెలికాప్టర్‌లో పూలు కురిపించిన ప్రభుత్వమే, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని, డాక్టర్లను నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. 40 రోజుల లాక్‌డౌన్‌లో ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నారని, బయటకు వచ్చేస్తున్నారని వాపోయారు. కరోనా ఆస్పత్రిలో కరోనా రోగుల మధ్య 3 నెలలుగా ఉంటున్న వైద్యుడి పరిస్థితి ఏమిటి? వాళ్లు ఎలాంటి మానసిక క్షోభకు గురవుతున్నారో ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు.