ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనన తరహాలో యావత్ దేశాన్ని కదిలించింది హైదరాబాద్‌లోని డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. ప్రతి విద్యార్థి రోడ్డుపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేశారు. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ప్రియాంకారెడ్డి హత్యకేసులోని నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తరలించడాన్ని పలు విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ పీఎస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు.
నిందితులకు పోలీసులు అత్యంత భద్రత కల్పించి షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆందోళన చేస్తున్న వారి కంట పడకుండా వ్యానులలో కింద పడుకోబెట్టి తరలించారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న స్థానికులు నిందితులను తరలిస్తున్న వ్యానులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా ఆందోళనకారులను తప్పించి నిందితులను జైలుకు తరలించారు. ప్రియాంకారెడ్డిని హత్యాచారం చేసిన నలుగురు నిందితులను
జైలుకు తరలించే ముందు వారికి పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో తహశీల్దారు ముందు నిందితులను హాజరుపర్చారు. తహశీల్దారు కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. అక్కడే నిందితుడికి 7 రోజుల రిమాండ్ విధించడంతో పీఎస్ నుంచే నేరుగా జైలుకు తరలించారు.