ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి చెందడంతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. కర్నూలుకు చెందిన ప్రముఖ డాక్టర్ ఈ నెల 15న మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా కర్నూలుతో పాటు ఆ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్న రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల ప్రజలు ఆ వైద్యుడి దగ్గర చికిత్స చేయించుకున్నారు.
చనిపోయిన వైద్యుడికి కరోనా ఉందని తేలడంతో అతడి వద్ద చికిత్స చేయించుకున్న వారికి, అందులోని సిబ్బందికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. గత నెల 20 నుంచి ఈనెల 11 వరకు కర్నూలులోని KM ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారు, పరామర్శించడానికి వెళ్లిన వారందరూ స్వచ్చందంగా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. 8333988955 నెంబరుకు వాట్సాప్ లేదా SMS ద్వారా సమాచారం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. స్వచ్చందంగా ఉచితంగా పరీక్ష చేయించుకొని కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు. వైద్య పరీక్షలు చేయించుకునే వరకు ఎవరూ ఇళ్లనుంచి బయటికు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.