రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తొలుత ఆమెతో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. చర్చల నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా అరుణ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు అరుణతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం నాటికి ఇవి కొలిక్కివచ్చాయి. రాష్ట్రాల వారీగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి డీకే అరుణ బీజేపీలో చేరుతున్నట్లు అమిత్‌షా నేతలకు చెప్పారు. ఈక్రమంలో అమిత్‌షా, కేంద్రమంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు డీకే అరుణ బీజేపీలో చేరారు. వాస్తవంగా బీజేపీ తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రమే వెలువడాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అరుణ అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల అంశంలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని.. లోక్‌సభ అభ్యర్థిత్వాల అంశంలోనూ తన అభిప్రాయాలను పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థుల అంశంలో తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న భావనతో ఉన్నారు. తాను కోరిన ఇద్దరికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని పార్టీ నేతల ముందే స్పష్టం చేశారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి అరుణను పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, ఎన్నికల ఖర్చుపై పార్టీ హామీఇస్తే ఆలోచిస్తానని అన్నట్లు సమాచారం. దీనిపై పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి లేదా అనిరుద్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్‌లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరగా వంశీచంద్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్‌కర్నూల్ నుంచి సతీష్‌మాదిగను బరిలో దింపాలని కోరగా మల్లురవి వైపే పార్టీ మొగ్గు చూపింది. ఇటీవల జరిగిన పీసీసీ సమావేశంలో కూడా అరుణ సీనియర్లు పోటీకి దూరంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.