![Diwali releases: ఒక్క పండగకి ఇన్ని సినిమాలా? 1 List of Diwali releases shocks Tollywood](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/10/collage-2-1.jpg)
Diwali releases this year:
ఈ దీపావళి సీజన్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు లేకున్నా, థియేటర్లలో దూకుడు కనిపిస్తోంది. పలు స్ట్రైట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, అలాగే హిందీ సినిమాలు కలిసి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్దమయ్యాయి. అయితే, ఈ అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించగలవా? థియేటర్లలో వీటిని ఒకేసారి ఎలా ప్రదర్శిస్తారన్న ప్రశ్నలు ప్రస్తుతం ప్రధానంగా ఉత్పన్నం అవుతున్నాయి.
మొదటగా, ఈ సీజన్‌లో విడుదలకు సిద్ధమైన తెలుగు సినిమాలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల అవుతుండడంతో దీని పై మంచి అంచనాలు ఉన్నాయి. పమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఇంకొక ఆసక్తికర చిత్రం KA. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. దీపావళి సీజన్‌లో ఈ సినిమా పలు భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్‌కు ఈ సినిమా మీద చాలా ఆశలు ఉన్నాయి.
ఇతర తెలుగు సినిమాల పరంగా, జీబ్రా కూడా అదే రోజున అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమాలో సత్యదేవ్, ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అవగాహన ప్రేక్షకులలో కొంచెం తక్కువగా ఉందని చెప్పవచ్చు.
తెలుగు సినిమాలే కాకుండా, పలు డబ్బింగ్ చిత్రాలు కూడా దీపావళి సీజన్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కమల్ హాసన్ నిర్మాతగా, శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ప్రశాంత్ నీల్ రచించిన కన్నడ చిత్రం బఘీరా కూడా ఈ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళ చిత్రాలు బ్రదర్, బ్లడి బేగర్ కూడా ఈ సీజన్‌లో విడుదల అవుతున్నాయి. అదేవిధంగా, బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలలో నటించిన భూల్ భులాయియా 3, సింగం అగైన్ వంటి హిందీ చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ విధంగా పలు భాషల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. ఈ పోటీలో ఏ సినిమాలు నిలబడి విజయం సాధిస్తాయో, ఏవి నిరాశపరుస్తాయో చూడాలి.