బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసు కూడా చాలా మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో చాలా విషయాలు బయటికి వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ఏం లేదు.. అన్నీ అబద్ధాలే.. ఆత్మహత్య చేసుకోవడం వల్లే దిశా చనిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఆమె డెడ్ బాడీ దొరికినప్పుడు ఒంటిపై బట్టల్లేవు.. రేప్ జరిగిందంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టి పారేశారు కుటుంబ సభ్యులు. ముంబై పోలీసులు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే దిశా కేసులో మరో సంచలన ట్విస్ట్ వచ్చింది. అదే ఆమె తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. తాజాగా ఆయన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. తమ కూతురు మరణంపై అనేక పుకార్లు వ్యాప్తి చేసినందుకు ఈ ముగ్గురు వ్యక్తులపై ఆగస్ట్ 14న ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పోలీసులు వేగంగా స్పందించారు. విచారణను వేగవంతం చేశారు. కావాలనే కొందరు సుశాంత్ సింగ్ ఆత్మహాత్యతో దిశా మరణానికి లింక్ పెడుతున్నారని.. ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లతో పాటు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టి తమ కూతురు పరువు తీస్తున్నారని ఆయన ఆవేదన చెందాడు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తమను ఎంతగానో వేధిస్తున్నాయంటూ వాపోయాడు. దాంతో ముంబై పోలీసులు పునీత్ వశిష్ట, సందీప్ మలాని, నమన్ శర్మలపై కేసులు పెట్టారు. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్‌గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే.