బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ జూన్ నెలలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఆమె మరణించిన తర్వాత వారం రోజులు కూడా గడవకముందే సుశాంత్ కూడా బలవన‍్మరణం చెందడంతో వీరిద్దరి మృతికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి. దిశకు సహాయం చేసే క్రమంలో సుశాంత్‌కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే అతడు కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో దిశ సలియాన్‌ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారంటూ బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో దిశ మరణం గురించి విస్తృత ప్రచారం జరగడంతో ఆమె తల్లిదండ్రులు వాసంతి సలియాన్, సతీశ్ సలియాన్ ఆవేదన చెందారు. ఆజ్‌తక్‌తో వారు మాట్లాడుతూ.. ‘‘మా కూతురు గర్భవతి కాదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ తను గర్భం దాల్చలేదు. తనపై ఎన్నడూ అత్యాచారం కూడా జరుగలేదు. తన అవయవాలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక గురించి ముంబై పోలీసులు మాకు వివరించారు. మాకు వారిపై పూర్తి నమ్మకం ఉంది. కేసు విచారణ కొనసాగుతుంది.
దయచేసి దిశకు చెడ్డపేరు తెచ్చేలా ప్రచారం చేయకండి. తన గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. మీడియాకు భావ ప్రకటన స్వేచ్చ ఉంది. అయితే మా వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించవద్దు’’అని విజ్ఞప్తి చేశారు. తమ కూతురి గురించి తప్పుగా మాట్లాడవద్దని, నిజానిజాలేమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. కాగా మీడియా వల్ల మానసిక వేదనకు గురవుతున్నామంటూ దిశ తండ్రి ఇది వరకే పోలీసులకు లేఖ రాశారు.