హైదరాబాద్ శివారులో దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్‌ను కూడా విడుదల చేశాడు. అయితే వర్మకు షాకిస్తూ దిశ తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా నిర్మాణాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దిశపై అత్యాచారం చేసిన నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోందని, ఈ సమయంలో సినిమా నిర్మాణం సరికాదని దిశ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. దిశ తండ్రి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం, సెన్సార్ బోర్డుకు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.