విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం సంచలనంగా మారిపోయింది. ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అందులో స్టార్ డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు ఉన్నాడు. ఆ కుర్రాడి వయసు 29 సంవత్సరాలు మాత్రమే. ఇక 34 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కూడా అక్కడే చనిపోయాడు. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కమల్ అక్కడికి వెళ్లి అందరికీ సాయం చేసాడు. అక్కడే ఉండి గాయపడిన వాళ్లను హాస్పిటల్ తీసుకెళ్లాడు. అంతేకాదు సోషల్ మీడియాలో తన సంతాపం వ్యక్తం చేసాడు.
ఇప్పటి వరకు మాతో పని చేసిన వాళ్లే ఇప్పుడు లేరని చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఈ ప్రమాదం కన్నీరు పెట్టించేది. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరకూడదని కోరుకుంటున్నానని అంటు ట్వీట్ కూడా చేసాడు. ఇక ఇదిలా ఉంటే చనిపోయిన టెక్నీషియన్స్ కుటుంబాలకు కోటి రూపాయలు సాయం ప్రకటించాడు కమల్ హాసన్. నిర్మాత సంస్థ లైకా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించలేదు. అయితే ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దర్శకుడు శంకర్ మాత్రం దీనిపై స్పందించలేదు. తొలిసారి ఈయన ఈ ఘటనపై నోరు విప్పాడు.
ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ తన కళ్లలోనే ఉందని.. ఆ రోజు నుంచి నిద్ర కూడా రావడం లేదని చెప్పాడు. అది కలలో కూడా ఊహించని దుర్ఘటన అని.. తన అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మరణం తనను కలిచివేసిందని తెలిపాడు శంకర్. ఆ రోజు ఆ క్రేన్ తనపై పడినా బాగుండేదని.. తాను చనిపోయినా బాగుండేదని సంచలన పోస్ట్ చేసాడు దర్శకుడు శంకర్. ఫేస్ బుక్‌లో ఈయన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మీరు మాత్రం ఏం చేస్తారులెండి సర్.. త్వరగా కోలుకోండి అంటూ అభిమానులు ఆయనకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును సిఐడికి అప్పగించారు తమిళనాడు ప్రభుత్వం.