మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన “శ్రీదేవి బంగ్లా” చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అలనాటి తార శ్రీదేవి జీవితం నేపథ్యంలో ఉందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ చిత్రబృందానికి నోటీసులు కూడా పంపించారు. ఈ వివాదంపై తాజాగా దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ప్రియా ప్రకాశ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాను ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేద్దాం. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. అలాంటప్పుడు సినిమాలోని సస్పెన్స్ గురించి ముందే చెప్పలేం. సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పుకొంటూ కూర్చోలేను అన్నారు.
నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? మమ్మల్ని సినిమా విడుదల చేసుకోనివ్వండి. బోనీ కపూర్ మాకు పంపిన నోటీసులను మేం ధైర్యంగా ఎదుర్కొంటాం. అనుమతి లేకుండా ఒకరిపై బయోపిక్ తీయకూడదన్న విషయం మాకూ తెలుసు. శ్రీదేవి అనే నటి లండన్‌లో ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్న నేపథ్యంలో నేను కథ రాసుకున్నాను” అని తెలిపారు.
ప్రియా ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర పేరే ‘శ్రీదేవి’.. అందులోనూ ప్రముఖ హీరోయిన్ పాత్ర కావడం కాకతాళీయంగా జరిగిపోయింది. దానికే ఇంత రాద్దాంతం ఎందుకు? ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాబట్టి సినిమా శ్రీదేవి నేపథ్యంలో తెరకెక్కించిందా? లేదా? అన్నది ప్రేక్షకులకే వదిలేయాలి” అని అన్నారు. “శ్రీదేవి బంగ్లా” చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.