దర్శకుడు రవి శ్రీవత్స .. నటి సంజన తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు ఆమె క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘గండ హెండతి’ చిత్రం షూటింగ్ సందర్భంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రవి శ్రీవత్సపై నటి సంజనా ఆరోపణలు చేశారు. షూటింగ్‌లో మొదట ఒక ముద్దు అంటూ ఆపై 10, ఆ తర్వాత 30 ముద్దులు పెట్టారంటూ సంజనా ఆరోపించారు. రవి శ్రీవత్స స్పందిస్తూ తాను ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని తెలిపారు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీమణులు, సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరె సైతం ఉన్నారని పేర్కొన్నారు.
ఇంతమంది షూటింగ్‌లో ఉండగా తాను ఎలా ముద్దు పెట్టగలనని అన్నారు. ఒకటికి రెండు సార్లు సినిమా గురించి వివరించి తెలిపాకే ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. హిందీ సినిమా ‘మర్డర్’ రీమేక్ అని చెప్పి ఆ సినిమా సీడీని కూడా ఇచ్చి చూడమని తెలిపానని చెప్పారు. సంజనా పబ్లిసిటీ కోసమే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న మరో దర్శకుడు వి.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ #మీటూను దుర్వినియోగం చేస్తున్నారని, దర్శకులు సంఘం సంజనా ఆరోపణలను ఖండిస్తోందని చెప్పారు.