వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లిన రాంగోపాల్ వర్మ…సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపుగా 40 నిమిషాలకు పైగా జగన్, వర్మ చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం జగన్ తో కలిసి వర్మ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు.
సినిమా టికెట్ రేట్ల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వర్మ భేటీ అయిన దాఖలాలే లేవు. తాజాగా వర్మ విజయవాడ రావడం, ఆ వెంటనే జగన్ తో భేటీ అయిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో తాను తీయబోయే సినిమా గురించి కూడా జగన్ కు ఆర్జీవీ వివరించినట్టు తెలుస్తోంది.