ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్లోని తన నివాసంలో మృతిచెందారు. కృష్ణ మోహనరావు తన తండ్రి నిర్మించే చిత్రాలకు నిర్మాణవ్యవహారాలు చూసుకొనేవారు. తరువాత తమ్ముడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘భలేకృష్ణుడు’ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు కృష్ణమోహనరావు. ఆ తరువాత పలు సినిమాలు చేశారు. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్ళిసందడి’ చిత్రానికి కృష్ణమోహనరావు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణవార్త విని పలువురు సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు పలువురు చిత్రప్రముఖులు. కృష్ణమోహన్రావుకు ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.