దిల్ రాజు కొత్త బ్యానర్‌లో రెండో సినిమా.. హీరోగా యశ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట నెలకొల్పిన ఈ నిర్మాణ సంస్థకు దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నుంచి మొదటి సినిమాగా వచ్చిన ‘బలగంస సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంస్థ నుంచి రెండో సినిమా రాబోతోంది.
కొరియోగ్రాఫర్ యశ్వంత్ (యశ్) మాస్టర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘ఆకాశం దాటి వస్తావా’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక మురళీధరన్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈమె బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ కుమార్తె. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే, ఈ చిత్రం ద్వారా శశికుమార్ ముత్తులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ గాయకుడు కార్తీక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. దర్శకుడు శశి తన లైఫ్‌లో జరిగిన విషయాలనే కథగా రాసుకున్నారని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం బలమని.. కార్తీక్ అన్ని పాటలూ అద్భుతంగా చేశారని అన్నారు.
‘ఈ సినిమా స్టోరీ మొత్తం శశి వ్యక్తిగత జీవితంలో నుంచే వచ్చింది. వ్యక్తిగత జీవితంలో నుంచి వచ్చే స్టోరీలు స్క్రీన్ మీదికి తీసుకొచ్చేటప్పుడు వాళ్లు చాలా కష్టపడతారు. అలాగే శశి కష్టపడుతూ అందరినీ కష్టపెడుతూ ఈ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆకాశం దాటి వస్తావా.. ప్రేమికులుగా ఉన్నప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడతారు కదా.. అదే ఈ సినిమా టైటిల్. ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ కాంటెంట్‌తో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తారు’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.