బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్ కుమార్‌ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం చేరవేస్తామని దిలీప్ కుమార్ కుటుంబ సన్నిహితుడు ఫైసల్ ఫరూఖి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు రాగా, ఫైసల్ ఫరూఖి ఇవి వదంతులేనని తోసిపుచ్చారు.
1944లో జ్వర్ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దిలీప్ కుమార్ ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో మరుపురాని చిత్రాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోహినూర్, మొఘల్ ఇ ఆజం, దేవ్‌దాస్, నయా దౌర్, రాం ఔర్ శ్యామ్ చిత్రాల్లో దిలీప్ కుమార్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998లో ఖిలా మూవీలో బిగ్ స్ర్కీన్‌పై కనిపించారు. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.