ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్(98) మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే దాదాపు 15 రోజుల తర్వాత ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
దిలీప్‌కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1944లో తెరకెక్కిన ‘జ్వార్‌భాత’ సినిమాతో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ‘జోగన్’, ‘బాబుల్’, ‘దేవ్‌దాస్’, ‘ఫుట్‌పాత్’, ‘అజాద్’ ‘లీడర్’, ‘కోహినూర్’, ‘ధునియా’ వంటి సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1998లో విడుదలైన ‘ఖిల్లా’ తర్వాత దిలీప్ వెండితెరపై కనిపించలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.