టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా చాలా బిజీగా ఉన్నాడు. అయితే డైరెక్టర్స్, నిర్మాతలు అప్పుడప్పుడు తెరపై అతిథి పాత్రల్లో మెరుసు ఉంటారు. దిల్ రాజు కూడా గతంలో అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని టాక్.
గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా రాబోతుంది. ఇది నటి అంజలి 50వ సినిమా కావడం విశేషం. గీతాంజలి సినిమాలో నటించిన వాళ్లంతా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. కోన వెంకట్ రచన, నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ఆద్యంతం భయపెడుతూ నవ్వించింది. ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది.
మొదటి పార్ట్ లో దిల్ రాజు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో రెండో పార్ట్ లో కూడా దిల్ రాజుని మూవీ మేకర్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వమని అడిగితే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో దిల్ రాజు కనపడనున్నారు. మరోసారి వెండితెరపై దిల్ రాజు సందడి చేయనున్నారు.
నిర్మాతగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ తో పాటు శతమానం భవతి సీక్వెల్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ స్థాపించి పలు చిన్న సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు సోదరుడు శిరీష్ పెళ్లి జరగడంతో గత కొన్ని రోజులుగా ఆ పెళ్ళి హడావిడిలో ఉన్నారు.
మరో వైపు దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఆయనకు ఆఫర్లు ఇచ్చినట్టు సమాచారం. నిజామాబాద్, జహీరాబాద్‌ల నుంచి పోటీ చేయాలని ఈ పార్టీలు ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.