Game Changer: పాన్ ఇండియా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా నిన్న.. హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ‘గేమ్‌ఛేంజర్’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చాడు.
ఈ మూవీ షూటింగ్ చిరవి దశకు చేరుకుందన్నారు. కీలక అప్‌డేట్స్ కోసం కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు. ”మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుఫాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి తగ్గటుగా శంకర్ ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్ చేస్తాం.
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. ‘జరగండి జరగండి’ పాట విడుదల చేశాం. సాంగ్‌లో చూసింది కేవలం రెండు శాతం మాత్రమే. 98 శాతం దాచి ఉంచాం. థియేటర్‌లో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డ్యాన్స్ చేస్తారు. ఐదు నెలలు కాస్త నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘దిల్ మామా.. మాకొక అప్‌డేట్ ఇవ్వు’ అంటూ మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తున్నా. ఈ చిత్రానికి సంబంధించి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను. శంకర్ అప్‌డేట్ ఇవ్వమంటే నేను ఇస్తా అంతే” అని దిల్ రాజు అన్నారు.
రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ యువ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.