భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు సరైన వసూళ్లు సాధించాలంటే థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కాగా ప్రభుత్వం అనుమతితో ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం హైదరాబాద్ థియేటర్ యాజమాన్యాలు వెల్లడించాయి. మరోపక్క ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
కాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై తాజాగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం సినిమా అంటే నాలుగు రోజుల ముచ్చటే. ఆ నాలుగు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాల్సి వస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకే తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్ యాజమాన్యాలు ధరలు పెంచాయి. ‘బాహుబలి’ లాంటి చిత్రాలు విడుదలై 50 రోజులు కూడా ఆడని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ‘మహర్షి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదల చేయబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.