Dhoomam OTT:
మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ధూమం” సినిమా బుల్లి తెర మీద ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మైండ్ బ్లోయింగ్ గా ఉండే ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. “కేజీఎఫ్”, “సలార్” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ, పార్వతి నాయర్, దేవ్ మోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
గత ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్ గా అంచనాలను అందుకోలేక పోయింది. కేవలం మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. కాబట్టి “ధూమం” సినిమాను కేవలం మలయాళంలో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో విడుదల చేయలేకపోయారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో జులై 11న ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
ఆహా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. “ధూమం” సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. “ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీకు ఊహించని అనుభవాన్ని ఇస్తుంది” అని ఆహా సినిమా గురించి బాగానే హైప్ క్రియేట్ చేసింది.
సినిమాలో వినీత్, అనుమోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ సినిమాకి సంగీతం అందించారు. సినిమాతో పాటు పూర్ణచంద్ర సంగీతానికి కూడా మంచి మార్కులు పడ్డాయి.
ఇక ధూమం సినిమా కథ మొత్తం సినిమా హీరో అవినాష్ (ఫాహద్ ఫాజిల్) పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవినాష్ ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేసే వ్యక్తి. ఒకరోజు కొన్ని పరిస్థితుల వల్ల అనుకోని ఇబ్బందుల్లో పడతాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని భార్య బాడీలో బాంబ్ పెట్టి అవినాష్ ను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ అపరిచితుడు ఎవరు? అవినాష్‌ను ఎలా ఇబ్బందుల్లోకి నెట్టాడు? చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే “ధూమం” సినిమా చూడాల్సిందే.