సంచలన నటి అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్‌కు మధ్య విడాకులకు నటుడు ధనుషే కారణమని విజయ్ తండ్రి నిర్మాత ఏఎల్ అలగప్పన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తాజాగా స్థానిక మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా విజయ్-అమలాపాల్ మధ్య విడాకులు జరగడానికి గల కారణాన్ని తెలియచేశారు. ‘పెళ్లి తర్వాత అమలాపాల్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ధనుష్ తన నిర్మాణ సంస్థలో తెరకెక్కించబోయే ‘అమ్మ కనక్కు’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అమలాపాల్ కూడా ఆ సినిమా చేయడానికి సిద్ధపడింది. దీంతో విజయ్, అమలా విడాకులు తీసుకుని విడిపోయారు.’ అని అలగప్పన్ ఆరోపించారు. దీంతో కోలీవుడ్ మొత్తం అలగప్పన్ ఆరోపణల గురించి చర్చించుకుంటోంది.
2017లో విడాకులైన సమయంలో విజయ్ స్పందిస్తూ.. ‘అమలాపాల్ తన కెరీర్‌ను కంటిన్యూ చేయాలని ఆశించినప్పుడు నేను, నా కుటుంబం ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. మేము అభ్యంతరాలు చెప్పమని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వివాహబంధం అనేది నిజాయతీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య నిజాయతీ లోపిస్తే అ బంధానికి అర్థం లేదు.’ అని తెలిపారు. ఈ క్రమంలోనే గతేడాది జులైలో ఏఎల్ విజయ్ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అమలాపాల్ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.